వాక్య వ్యాఖ్యానం
యిర్మియా 33:14-18
“ఆ దినములు రానున్నవి,” అని యిర్మియా ఐదు వచనాలలో మూడుసార్లు ప్రవచించాడు. యిర్మియా “ఆ దినములు” వస్తున్నాయని ఏ కాలంలో లేదా ఆ దినములు ఏ సందర్భంలో ప్రత్యక్షమవుతాయని ప్రవచించాడు? యిర్మియా యూదాలో రాజకీయ కల్లోలంతో నిండిన నలభై సంవత్సరాల కాలంలో—క్రీపూ 627 నుండి 586 వరకు—ప్రవచించాడు. ఆ నాలుగు దశాబ్దాల్లో అయిదుగురు రాజులు ఎదిగి పతనమవ్వటం ఆయన చూశాడు. వారిలో ఒకరు సంవత్సరం కూడా పాలించలేదు. రాజకీయ అస్థిరత చుట్టుపక్కలున్న చల్దీయులకు అవకాశమై, వారు దక్షిణాది రాజ్యమైన యూదా రాజ్యంపై కుట్రలు పన్ని, కొంచెం కొంచెంగా రాజ్యాన్ని ఆక్రమించి, నాయకులను చెరపట్టటానికి అవకాశమిచ్చింది. సిద్కియా రాజ్యపాలనలో (క్రీపూ 597–586) నెమ్మది నెమ్మదిగా జరిగిన ఈ ఆక్రమణ యెరూషలేము మరియు దావీదు వంశ చెరపట్టబడటంతో పరాకాష్టకు చేరింది. ఈ నాలుగు దశాబ్దాలు, పాలకులు ధనికులతో చేసుకున్న అవినీతి కూటమిని కూడా చవిచూసింది. యెహోవా దేవుడు తిరుగులేని నిబంధన చేసిన పేదల పక్షంగా ఉండి వారిని రక్షించాల్సిన రాజులు, ధనికులకు మద్దతు ఇచ్చి పేదలను అణగదొక్కారు. అన్యాయాలను ఖండించాల్సిన ప్రవక్తలు దుష్టతను సమర్థించారు. యాజకులు వారు సమర్పించాల్సిన బలులు, కానుకలను సిగ్గులేకుండా దోచుకున్నారు. యెహోవాపై నమ్మకం ఉంచాల్సిన దావీదు వంశ రాజులు; ఆయుధాలు, సైన్యాలు, సరిహద్దుల ఆవలున్న రాజకీయ మిత్రులను నమ్మారు. “దావీదు చిగురు” యెహోవా దేవునితో చేసుకున్న నిబంధనలో విఫలమైంది. జీవానికి సంబంధించిన ఆచూకీ లేకుండా పోయింది.
33వ అధ్యాయానికొచ్చేసరికి యిర్మియా చల్దీయుల చెరలో ఉన్నట్లు గమనించగలం. మొదటి 29 అధ్యాయాలలో ఈ ఉగ్ర ప్రవక్త రాబోయే యెహోవా ఉగ్రతను గురించి ప్రకటించాడు. యెరూషలేము పతనం మరియు ప్రముఖులు చెరపట్టబడటం యెహోవా శిక్షగా ఆయన వ్యాఖ్యానించాడు. పతనం తర్వాత యిర్మియా విలాపవాక్యముల గ్రంధంలో విలపిస్తాడు కానీ అది నిరాశలో కాదని గమనించాలి. తనూ, యూదా నాయకులూ చెరపట్టబడటంతో, యిర్మియా తన పంథాను మార్చుకున్నాడు. యెహోవా స్థిరమైన ప్రేమను ఆయన స్మరించుకొంటూ నిరీక్షణనందించాడు. ఈ నిరీక్షణ దావీదు విశ్వసనీయతను బట్టి కాక, బాధితుల పట్ల దేవుని అచంచలమైన ప్రేమపై మాత్రమే ఆధారపడుందని గమనించాలి. ఒకప్పుడు ప్రజలుగా ఎంచబడని దేవుని ప్రజలతో, కేవలం దేవుడు చేసిన నిబంధన మేరకు అవిశ్వాసులైన దావీదు వంశంలోనుంచి కూడా దేవుడు తన విశ్వాస్యతనుబట్టి అధిపతిని లేవనెత్తగలడు. చెరలోనున్న వారిని నిరీక్షణ కోల్పోవద్దని ప్రవక్త ప్రోత్సహించాడు. ఓడిపోయిన సముదాయాల పట్ల దేవుని విశ్వసనీయత, పూర్తిగా పాడైన వంశంలోనుంచి కూడా హింస, దుష్టతకు మారుపేరుగా మారిన పట్టణాల్లో సైతం నీతిన్యాయాలతో కూడిన పరిపాలననందించటానికి నాయకులను లేవనెత్తగల శక్తి దేవునికుందనే అంశాలపై ఈ వాక్యభాగం మీద బోధించేవారు దృష్టి పెట్టవచ్చు.
